_తుపాను ముప్పు_10న ఉత్తరాంధ్ర, దక్షిణ ఒరిస్సా కు చేరువ..

 *_తుపాను ముప్పు_*


*10న ఉత్తరాంధ్ర, దక్షిణ ఒరిస్సా కు చేరువ*


గాలి తీవ్రత 85 కి.మీ. నుంచి 100 కి.మీ.?


పునరావాస కేంద్రాల్లో ముమ్మర ఏర్పాట్లు


గోపాలపూర్‌, న్యూస్‌టుడే: దక్షిణ అండమాన్‌ సముద్రంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. శనివారం మధ్యాహ్నానికిది వాయుగుండంగా మారుతుంది. 

*ఆదివారం (8న) మధ్యాహ్నానికి తుపానుగా బలం పుంజుకోనుంది.*

 తర్వాత 10 వరకు ఉత్తర, పశ్చిమ దిశగా ప్రయాణించి సాయంత్రానికి ఉత్తరాంధ్ర (శ్రీకాకుళం), దక్షిణ ఒడిశా (గోపాలపూర్‌) సరిహద్దులో తీరానికి చేరువవుతుంది. 


♦️ఆ తర్వాత తుపాను దిశ మార్చుకుంటుందా?, బలహీనపడుతుందా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని గోపాలపూర్‌ డాప్లార్‌ రాడార్‌ కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌ దాస్‌ ‘న్యూస్‌టుడే’కు చెప్పారు.


 వాయుగుండంగా మారిన తర్వాత మరిన్ని వివరాలు చెప్పగలుగుతామన్నారు. 


ఈ విపత్తు 10న పశ్చిమ బంగాళాఖాతానికి చేరుకున్న తర్వాత గాలితీవ్రత పెరుగుతుందన్నారు. 

ప్రస్తుతం సముద్ర ఉపరితలంలో 29 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నందున తుపాను బలం పుంజుకోవడానికి అనుకూలంగా ఉందని చెప్పారు. దీనిపై నిరంతర అధ్యయనం జరుగుతోందన్నారు.


నాలుగు జిల్లాలకు భారీ వర్షాలు..


గత 48 గంటల్లో ఉత్తరకోస్తా, దక్షిణ ఒరిస్సా జిల్లాల్లో కాలవైశాఖి ప్రభావంతో వర్షాలు కురిశాయని, శనివారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని ఉమాశంకర్‌ దాస్‌ చెప్పారు. సోమవారం (9న) తుపాను ప్రభావంతో ఒరిస్సా తీర ప్రాంతాల్లో మేఘాలు అలుముకుంటాయని, 


♦️10న గంజాం, ఖుర్దా, పూరీ, జగత్సింగ్‌పూర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో 9, 10 తేదీల్లో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం సముద్రంపై గంటకు 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయని, శనివారం మధ్యాహ్నానికి ఈ తీవ్రత 50 కి.మీ.కు పెరుగుతుందని దాస్‌ చెప్పారు.


*_తీవ్ర తుపానుగా మారకపోవచ్ఛు._*


ఐఎండీ శాస్త్రజ్ఞుడు డాక్టర్‌ శరత్‌చంద్ర సాహు ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ... 


♦️10న తుపాను ఉత్తరాంధ్ర, దక్షిణ ఒరిస్సా ల మధ్య తీరానికి చేరువైన తర్వాత బలహీనపడొచ్చని లేదా దిశ మార్చుకునే సూచనలు ఉన్నాయని చెప్పారు. 


దీనిపై పూర్తి స్పష్టత ఇంకా లేనందున ఎక్కడ తీరం దాటుతుందో కచ్చితంగా చెప్పలేకపోతున్నామని తెలిపారు. 

అధ్యయనం కొనసాగుతోందని, శనివారం మరిన్ని వివరాలు చెప్పలుగుతామన్నారు. ప్రజలు ఆందోళనకు గురి కావద్దని సాహు పేర్కొన్నారు.

Tags

Post a Comment

0 Comments